- అస్సాం అధ్యక్షుడిగా భబేష్ కలిట
- రెండు రాష్ట్రాలకు కొత్త సారధుల నియామకం
న్యూఢిల్లీ: కేంద్రంతోపాటు మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో పట్టు బిగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అయితే బాధ్యతల విషయంలో మహిళలకు ప్రముఖ స్థానం లేదని భావించే వారికి చెక్ పెట్టే విధంగా మణిపూర్ రాష్ట్ర బీజేపీ పగ్గాలను పార్టీ సీనియర్ నాయకురాలు శారదాదేవికి అప్పగించారు. ఇప్పటి వరకు ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఇకపై అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
అస్సాంలో ఊహించనిరీతిలో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ పార్టీని బలోపేతం చేసే విషయంలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడి మార్పు అని తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. గత ఎన్నికల్లో పార్టీ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రంజిత్ కుమార్ దాస్ మంత్రివర్గంలో చేరడంతో అధ్యక్షుడి మార్పు జరిగింది. అసోంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ 60 స్థానాల్లో గెలుపొందగా.. మిత్రపక్షాలు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన అసోం గణపరిషత్ (ఏజీపీ) 9, యూనెటెడ్ పీపుల్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) ఆరు సీట్లు.. మొత్తం 75 స్థానాల ఆధిక్యంతో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
మణిపూర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న శారదాదేవికే రాష్ట్ర సారధ్య పగ్గాలు అప్పగించారు. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తికేంద్ర సింగ్ గత మే నెలలో కరోనాతో మరణించారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని భర్తీ చేయాల్సి రాగా.. సీనియర్ నాయకురాలు శారదాదేవి నియామకానికే పార్టీ పెద్దలు మొగ్గు చూపారు. మణిపూర్, అసోం రాష్ట్రాల కొత్త అధ్యక్షుల నియామకాన్ని ఈనెల 20 వ తేదీనే అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ధృవీకరించారు.
